Video Of Day

Breaking News

డీఎల్‌ను బర్తరఫ్‌ చేసిన కిరణ్


డీఎల్ రవీంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదును చూసి వేటు వేశారు. మంత్రి పదవి ఇచ్చిన నాటి నుంచి తలనొప్పిగా తయారయిన డీఎల్ ను అమాత్య పదవి నుంచి అనూహ్యంగా తప్పించారు. అవినీతి ఆరోపణలతో తనను ఇరుకున పెట్టిన శంకర్రావును సాగనంపినట్టుగానే డీఎల్ పైనా వేటు వేశారు. తాను ప్రవేశపెట్టిన పథకాలను విమర్శించడం, తాను తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న డీఎల్ విషయంలో కిరణ్‌ తన పంతం నెగ్గించుకున్నారు. అధిష్టానం అనుమతితో మంత్రి వర్గం నుంచి ఆయనను తొలగించారు. బర్తరఫ్‌ వేటుతో డీఎల్ కు చెక్ పెట్టారు. తద్వారా తన వ్యతిరేకులకు హెచ్చరిక పంపారు. తనను ధిక్కరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు.

రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకుని వచ్చిన మరునాడే అసమ్మతి మంత్రులకు సీఎం కిరణ్‌ తిరుగులేని షాక్‌ ఇచ్చారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై హైకమాండ్‌ పెద్దలతో ఢిల్లీలో మంతనాలు జరిపి హైదరాబాద్‌ తిరిగొచ్చిన మరునాడే మంత్రి డీఎల్‌ను బర్తరఫ్‌ చేయడం గమనార్హం. రాజీనామాను కోరే అవకాశమున్నప్పటికీ అప్పటి వరకు వేచి చూడకుండా ఆయనను బర్తరఫ్‌ చేయడం రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సాకుతో సాగనంపారు. డీఎల్ లండన్ పర్యటన వెళ్లడంతో సమయం చూసి సీఎం చక్రం తిప్పారు. తనను వ్యతిరేకిస్తున్న మరో మంత్రి సి. రామచంద్రయ్యను కూడా క్యాబినెట్‌ నుంచి తప్పించాలనుకున్నా హైకమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని సమాచారం. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీన ఒప్పందం ప్రకారం ఆయనకు మంత్రి పదవి దక్కింది. కేంద్ర మంత్రి చిరంజీవి అండతో సీఆర్ కు పదవీ గండం తప్పిందని తెలుస్తోంది.

మంత్రులు ధర్మాన, సబిత రాజీనామాల నేపధ్యంలో రాష్ట్ర క్యాబినెట్‌ విస్తరణ తప్పదని కాంగ్రెస్‌ నేతలు భావించారు. ఖాళీల భర్తీ వరకే పరిమితమవ్వాల్సిందిగా కిరణ్‌కు అధిష్టానం సూచిస్తుందనుకున్నారు. డీఎల్‌పై వేటుకు ముఖ్యమంత్రి పట్టబట్టడంతో హైకమాండ్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలుస్తోంది. కడప లోకసభకు ఉప ఎన్నిక జరిగినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండడమే కాకుండా, మరికొందరు మంత్రుల్లోనే అసంతృప్తి రాజేసి అసమ్మతి రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారనేది సీఎం కిరణ్‌ ఫిర్యాదు. డీఎల్‌ కూడా సందర్భం దొరికినప్పుడల్లా సీఎంపై విమర్శలు గుప్పించారు. కడప లోకసభ ఉప ఎన్నికల బరిలో దింపి బలిపశువును చేయడం, తన దగ్గర ఉన్న వైద్య-ఆరోగ్య శాఖను విభజించడంతో రవీంద్రారెడ్డి అసమ్మతి గళం విప్పారు. అప్పటినుంచి కిరణ్ ప్రతి నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు.

కిరణ్ ఒంటెత్తు పోకడలపై నేరుగా అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇతర సీనియర్‌ మంత్రులు బొత్స, దామోదర రాజనర్సింహ, జానారెడ్డిలతో కలిసి అసమ్మతి రాజకీయాలు నడిపారు. గత ఏడాదిలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలవడంతో అందుకు నైతిక బాధ్యత క్యాబినెట్‌దే అంటూ తన రాజీనామా లేఖను సోనియాకు పంపారు. అప్పటి నుంచి కిరణ్‌ను గద్దె దించడానికి తన వంతు ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్టానం అండ లేకపోవడంతో డీఎల్ విఫలమయ్యారు. సాధారణ ఎన్నికలకు ఏడాదే గడువున్నందున అసమ్మతి నేతలకు ముకుతాడు వేయాలన్న కిరణ్ వాదనతో అధిష్టానం ఏకీభవించిందని, దీంతో డీఎల్‌పై వేటు పడిందంటున్నారు అధికార కాంగ్రెస్‌ నేతలు. డీఎల్‌ ఎపిసోడ్‌తో అసంతృప్త సీనియర్‌ మంత్రులు తమ అసమ్మతి రాజకీయాలకు స్వస్తి చెప్తారా లేదా అనేది వేచి చూడాలి!

No comments