వైఎస్ జగన్‌ నిరాహార దీక్ష భగ్నం

అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  చేస్తున్ననిరవధిక నిరాహార దీక్షను శనివారం భగ్నం చేశారు. 24న దీక్షను ప్రారంభించిన జగన్ను 29వ తేదీ అర్ధరాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని నేపథ్యంలో మర్నాడు రాత్రి ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఆయన దీక్ష ఏడో రోజుకు చేరింది. జగన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఆదేశాలివ్వాలని నిమ్స్ వైద్య బృందం ఉదయం 11 గంటలకు చంచల్‌గూడ సూపరింటెండెంట్‌కు లేఖ రాసింది. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆయన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే కళ్లు తిరిగి పడిపోయారని, ముఖ్యంగా పల్స్ రేటు భారీగా పడిపోయిందని, ద్రవాహారం ఇవ్వబోతే నిరాకరిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తక్షణమే బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బి.సైదయ్య.. వైద్యులను ఆదేశించారు. ఉదయం 11.30 గంటలకు ఆయన నిమ్స్ వైద్య బృందానికి లేఖను ఫ్యాక్స్ చేశారు. జైలు అధికారుల నుంచి ఆదేశాలు రాగానే జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న నిమ్స్ వైద్యులు శ్రీభూషణ్ రాజు(నెఫ్రాలజీ), శేషగిరిరావు (కార్డియాలజీ), వైఎస్‌ఎన్ రాజు(జనరల్ మెడిసిన్), నగేష్(ఆర్థోపెడిక్)లు బలవంతంగానైనా ఆయనకు ఫ్లూయిడ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నార్మల్ సెలైన్ ఎక్కించారు. సెలైన్ ఎక్కించే సమయంలో కూడా ఆయన తన దీక్షను భగ్నం చేయవద్దని, దయచేసి దీక్ష కొనసాగిస్తానని అన్నారని వైద్యులు పేర్కొన్నారు. కానీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, ఫ్లూయిడ్స్ తీసుకుంటూ దీక్ష కొనసాగించవచ్చునని వైద్యులు జగన్‌తో అన్నారు. దీనికి జగన్ స్పందిస్తూ.. మీరు ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత దీక్ష కొనసాగించడమంటే అది మనస్ఫూర్తిగా చేసినట్టు కాదని గుండెల మీద చెయ్యేసి చెప్పారని వైద్యులు పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆయనకు ఫ్లూయిడ్స్ ఇచ్చి దీక్ష భగ్నం చేసినట్టు వైద్యులు తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment