సీఎం నిజంగా రాజీనామా చేస్తారా?

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా పనులు చక్కబెట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో  సీఎంకు సన్నిహితంగా ఉండే కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. సీఎం వ్యతిరేకవర్గం కూడా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంట్లో సమావేశమై, కిరణ్‌పై ఎదురుదాడికి వ్యూహరచన చేయడమూ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణ బిల్లు మంగళవారం లోక్‌సభలో చర్చకు వస్తుండటంతో, దాన్ని కారణంగా చూపి పదవి నుంచి తప్పుకోవాలన్న యోచనలో సీఎం ఉన్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. కొత్త పార్టీ పెడితే ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారని కిరణ్ అంచనా వేసుకుంటున్నారు. దీనిపై కొందరు మంత్రులు, సన్నిహితులతో సమాలోచనలు సాగిస్తున్నారు.

రాష్ట్రాన్ని విభజించాలని ఆరు నెలల క్రితం సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన రోజు నుంచే తన పదవికి రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలకు సీఎం లీకులిచ్చారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాటం పేరుతో రాజీనామాను వాయిదా వేస్తూ వచ్చారు. విభజన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో రాజీనామాపై ప్రచారం బలంగా సాగింది. అయితే, లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టలేదన్న బీజేపీ వాదనను సాకుగా చూపించి, ఆయన రాజీనామాను చివరి వరకు సాగదీస్తూ వచ్చారు. ఈలోగా చకచకా ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారు. ఈనెల 21న పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు వేచి చూడాలని ఓ దశలో భావించారు. అయితే, రాజీనామాపై ఇప్పటికే విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించుకున్న నేపథ్యంలో ఇక తప్పుకోకపోతే పరువు పోతుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు మంత్రులు చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై  చర్చ ముగిసి ఓటింగ్ జరగడానికి ముందు రాజీనామా చేసే అవకాశముందని, గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తారని సీఎం సన్నిహిత నేతలు చెబుతున్నారు. ఏ కారణం చేతనైనా విభజన బిల్లు లోక్‌సభలో ముందుకు వెళ్లని పరిస్థితి ఉంటే రాజీనామా చేయకూడదన్న అభిప్రాయంతో సీఎం ఉన్నారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment