తెలంగాణ బిల్లుకు లోక్సభ ఆమోదం

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్సభ ఆమోదించింది. సీమాంధ్ర సభ్యుల గందరగోళం మధ్య మూజువాణి ఓటు ద్వారా ఈ తంతును ముగించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ బిల్లుపై సభలో 23 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది.  తెలంగాణకు బీజేపీ మద్దతు ఇవ్వడంతో టీ-బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుపై కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైపాల్ రెడ్డి, ప్రతిపక్ష బీజేపీ నేత సుష్మాస్వరాజ్ మాట్లాడారు. సుష్మాస్వరాజ్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడం గమనార్హం. ఈ బిల్లును రెండు రోజుల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే!

తెలంగాణ బిల్లుపై లోక్సభలో చర్చ కొనసాగుతున్నప్పుడు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల నిరసన వ్యక్తం చేశారు.  వారి నిరసనల మధ్యే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు చర్చ జరుగుతోంది. ఒక దశలో చర్చ కొనసాగుతుండగానే లోక్సభ వాయిదా పడినట్టు లోక్సభ చానల్ ప్రకటించడంతో గందరగోళం చెలరేగింది.  స్పీకర్ ఆదేశాలతో లోక్సభ ప్రసారాలను ఆకస్మికంగా నిలిపివేసి ఓటింగ్ నిర్వహించినట్లు సమాచారం. 

తెలంగాణ బిల్లుపై లోక్సభలో చర్చ నేపథ్యంలో లోక్సభలోకి మార్షల్స్ను స్పీకర్ మీరాకుమార్ పిలిపించారు. ముందు జాగ్రత్తచర్యగా లోక్సభ ప్రవేశద్వారాలను, గ్యాలరీలను కూడా మూసివేశారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment