రాజకీయ రుచి అంత తేలిగ్గా మరుస్తారా?

రాజకీయ నాయకులు ఓట్ల కోసం నోటికొచ్చిన వాగ్దానాలను చేస్తారు. వాటిని నెరవేరుస్తారన్న నమ్మకం ఇచ్చిన నేతలకే కాదు ప్రజల్లోనూ ఉండదు. అయితే ఇదంతా మనకు తెలిసిందే... ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతిజ్ఞలను కూడా నోటికి వచ్చినట్లు చేస్తుండడం విశేషం. అనుకున్నది నెరవేకుంటే ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రగల్భాలు పలుకుతుంటారు. రాజకీయాలకు ఇక స్వస్తి చెబుతామని చాణక్య శపథాలను చేస్తారు. అవన్నీ నీటిమీద చెక్కిన రాతి అక్షరాలే అవుతున్నాయి. మొన్నటికి మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన ఖరారైన నేపథ్యంలో... రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని, పోటీ చేసినా గెలవనని, ఏ పార్టీలోనూ చేరబోనని చెప్పుకొచ్చారు. మిగిలిన జీవితంలో కలం, కాగితంతో కాలక్షేపం చేస్తానని మీడియా మైకుల ముందు చెప్పారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ పలుకులు పలికి పట్టుమని రెండు నెలలు కూడా గడవక ముందే కిరణ్‌కుమార్‌రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.  కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీన్నిబట్టి రాజకీయాలపై ఉండవల్లి వైరాగ్యం కేవలం ప్రచారార్భాటమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  అయితే వీటినీ వారు సమర్ధించుకుంటున్నారు. పోటీ చేయనని చెప్పారే కానీ... రాజకీయాల్లో సిద్ధాంతకర్తగా ఉండనని ఎక్కడా చెప్పలేదు కదా అని ఆయన అనుచరులు సమర్థిస్తున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment