ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు!

లోక్‌సభ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2014’ బిల్లును రాజ్యసభ యథాతథంగా ఆమోదిస్తే.. ఈ నెలాఖరులోగానే రెండు రాష్ట్రాలు వేరుపడే అవకాశాలున్నాయి. అయితే రాజ్యసభ ఆమోదం, దానిపై రాష్ట్రపతి జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగానే రాష్ట్రాలు ఏ రోజు నుంచి వేరుపడతాయో తేలనుంది. త్వరలో లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు వెలువడనున్న పరిస్థితుల్లో.. ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయా? లేక ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడి.. తర్వాత వేరువేరుగా రెండు శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయా? అనే కోణాల్లో చర్చ సాగుతోంది. రాజ్యసభ ఆమోదించిన తర్వాత విభజన బిల్లు కేంద్ర హోంశాఖకు అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. రాష్ట్రపతి దానిని ఆమోదించాక.. రెండు రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.  ఆ నోటిఫికేషన్ ముందుగానే జారీ అయినప్పటికీ.. అందులో పేర్కొన్న రోజు (అపాయింటెండ్ డే) నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ ఎలాంటి సవరణలు చేయకుండా బిల్లును యథాతథంగా ఆమోదించిన పక్షంలో ఈ నెలాఖరులోగానే అది కూడా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందే రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయటానికి అవకాశాలున్నాయి.  రాజ్యసభలో బిల్లులోని ఏవైనా అంశాలపై సవరణ ప్రతిపాదించి ఆమోదించిన పక్షంలో.. దాన్ని మళ్లీ లోక్‌సభ ముందు ఆమోదానికి పెట్టాల్సి ఉంటుంది. గతంలో మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే బిల్లుపై 2000 జూలై 31న లోక్‌సభ ఆమోదించగా.. అదే ఏడాది ఆగస్టు 9న రాజ్యసభలో దానికి కొన్ని సవరణలు చేసి ఆమోదించారు. రాజ్యసభలో కొత్తగా ఆమోదించిన సవరణలకు లోక్‌సభ ఆమోదం కూడా అవసరమైంది. దాంతో మరుసటి రోజు అంటే 2000 ఆగస్టు 10న మళ్లీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి కొత్త సవరణలను ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభలో ఎలాంటి సవరణలకు ఆమోదం తెలిపే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment