ఆఖరి సీఎం ఎవరో!

సమైక్య రాష్ట్రానికి ఆఖరి సీఎం ఎవరోననే సందేహాలు రాష్ట్ర ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. కిరణ్ రాజీనామా నేపథ్యంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సీఎంను నియమిస్తుందా? లేక రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపుతుందా? అనే విషయంలో ఇప్పటికీ ఏ నిర్ణయం వెలువడకపోవడంతో రాష్ట్రంలోని ఆశావహ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నేతలు ఢిల్లీలో మకాం వేసి సీఎం పీఠం కోసం జోరుగా పైరవీలు చేస్తున్నారు. ఇప్పటికే ఇరు ప్రాంతాల నేతలు అధిష్టానం పెద్దలతో భేటీ కోసం పోటీ పడుతున్నారు.  రాష్ట్రపతి పాలన కంటే ప్రభుత్వ ఏర్పాటు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో ‘సీఎం’ ఆశావహుల సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది.

రాష్ట్రపతి పాలన లేకపోతే... ముఖ్యమంత్రి పదవికి... తెలంగాణ నాయకుల కంటే సీమాంధ్రకే, అందులోనూ కాపు సామాజిక వర్గానికి అవకాశమివ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా
చిరంజీవి, కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ బొత్స కూడా రేసులో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో కేంద్రమంత్రి చిరంజీవి మంగళవారం భేటీ అయ్యారు.

ఇక తెలంగాణ నాయకుల విషయానికి వస్తే..  డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మంత్రులు ముఖేష్ గౌడ్, డీకె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సునీతా లక్ష్మారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి తదితరులతో పాటు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా సీఎంగిరీ కోసం ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని, అనంతరం 27 లేదా 28 తేదీల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ ఉంటుందని వినికిడి. రాష్ట్ర విభజన జరగనున్నందున ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే సమైక్య రాష్ట్రానికి వారే చివరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment