Video Of Day

Breaking News

ఎన్నికల్లో కథా'నాయకులు'?


ఎన్నికలు సమీపిస్తే చాలు... సినీ హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులకు ప్రధాన పార్టీలనుంచి, చిన్న పార్టీల వరకు ఆహ్వానాలు అందుతాయి. కొందరు హీరోలు సొంతంగా పార్టీలు స్థాపిస్తుంటారు. మన రాష్ట్రంలో ఆంధ్రుల అభిమాన నాయకుడిగా పేరు పొందిన ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులోనూ ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్ కూడా అధికారాన్ని అందుకున్నారు. అయితే ఈ సారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సినీ గ్లామర్ ఊపందుకుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు సినీ గ్లామర్ను వాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ‘జనసేన’ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. శతృఘ్నసిన్హా, రాజ్‌బబ్బర్, హేమామాలిని వంటి పాతతరం తారలతోపాటు మరెందరో ఎన్నికల రాజకీయాల్లోకి దూకుతున్నారు. ఒక్కో స్థానంలో వేర్వేరు పార్టీలకు చెందిన నటులు పోటీ పడుతుండడం విశేషం. చంఢీగఢ్  నుంచి గుల్ పనగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున బరిలోకి దిగుతుండగా బీజేపీ.. నటి కిరణ్ ఖేర్‌ని రంగంలోకి దింపింది. దీంతో ఛండీగఢ్‌లో పోటీ రసవత్తరంగా మారింది. కేంద్ర రైల్వే మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ కూడా ఇక్కడ్నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఇద్దరు సినీ తారల మధ్య ఆయన కఠిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా సినీతారల గ్లామర్‌పై ఆశలు పెట్టుకుంది. అందుకే పలు రాష్ట్రాల్లో సినీతారలను రంగంలోకి దింపుతోంది. భోజ్‌పురి సూపర్‌స్టార్  రవికిషన్ (జాన్‌పూర్), నటి నగ్మా (మీరట్), నాటితరం బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ (ఘజియాబాద్) వంటివారి ఎన్నికల్లో  నిలబెట్టింది. బీజేపీ కూడా సినీగ్లామర్‌కు పెద్ద పీట వేస్తుంది. శతృఘ్నసిన్హా(పాట్నాసాహిబ్), హేమామాలిని (మథుర), పరేష్ రావల్(అహ్మదాబాద్ తూర్పు), జోయ్ బెనర్జీ(బిర్భుం), బబుల్ సుప్రియో(అసన్‌సోల్) వంటివారినీ ఎన్నికల బరిలో నిలిపింది. మూన్‌మూన్ సేన్(బంకుర), సంధ్యాసేన్(మిడ్నపూర్), విశ్వజిత్(న్యూఢిల్లీ), సూపర్‌స్టార్ దేవ్(ఘటల్)తోపాటు గాయకులు సౌమిత్రీరాయ్, ఇంద్రనీల్ లను తృణమూల్ కాంగ్రెస్‌ ఎన్నికల బరిలోకి నిలిపింది. అయితే సినీ గ్లామర్ పక్కా గెలుపు నిస్తుందని భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సినిమా రంగంలో ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో సఫలం కాలేకపోవచ్చు. ఉత్తరాదిలో అమితాబ్ బచ్చన్, రాజేష్‌ఖన్నా, ధర్మేంద్ర, గోవిందా వంటి సినీ స్టార్లు ఎంత ఉత్సాహంతో రాజకీయ ప్రవేశం చేశారో.. అంతే వేగంగా వెనుతిరిగిన విషయం తెలిసిందే. కాబట్టి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చే నటుల్లో ఎంత మంది తమ హీరోయిజాన్ని చూపిస్తారో చూడాలి!

No comments