Video Of Day

Breaking News

పవన్ స్పీచ్.. సామాన్యుడి గుండె చప్పుడు..

pavan kalyan, janasena
రాజకీయాల గురించి, సమాజం గురించి ఒక సగటు మనిషి ఆలోచనల్ని, ఆవేదనను శుక్రవారం నాటి పవన్ కల్యాణ్ ప్రసంగం ప్రతిబింబించింది. ముఖ్యంగా కొన్ని కీలక విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాన్యుడి ఆక్రోశాన్ని పట్టిచూపాయి. ప్రస్తుతం తెలంగాణ జాతిపితగా వెలుగొందుతున్న కేసీఆర్ ను ప్రశ్నించే ధైర్యం ఏ రాజకీయ నాయకుడికీ లేదు. జగన్, చంద్రబాబు కూడా దీనికి మినహాయింపు కాదు. అమరుల బలిదానాలు, కాంగ్రెస్, బీజేపీ పరస్పర అవసరాలు, జేఏసీ పోరాటాలతో సాకారమైన తెలంగాణ రాష్ట్ర కలను పూర్తిగా తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్..  తనను విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లేనని భావిస్తారు. ఆయన అనుచరగణం, భజంత్రీ మీడియా కూడా అదే ప్రచారం చేస్తారు. దీనికి విరుద్ధంగా కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని పవన్ ధైర్యంగా ప్రశ్నించారు. జన జాగృతి విరాళాలు లెక్కలు చెప్పాలని కవితను నిలదీశారు.
  రాష్ట్ర విభజన అంశంపై నోరు మెదపడానికి రాజకీయ నాయకులు, సినిమా నటులు ఇష్టపడరు. ఎవరైనా ప్రశ్నించినా సున్నిత విషయమంటూ తెలివిగా దాటవేస్తారు. దీనిపై పవన్ ధైర్యంగా మాట్లాడారు. రాష్ట్ర విభజనకు ముందు సోనియా, మన్మోహన్, రాహుల్ లు రాష్ట్రంలో పర్యటించి తెలంగాణకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సీమాంధ్రులకు ధైర్యం చెబితే ఎంత బావుండేదన్న ఆలోచన సదరు నాయకులకు లేకపోవడం తెలుగు సమాజం చేసుకున్న కర్మ. ఇన్ని పోరాటాలు, ఇన్ని బలిదానాల ఫలితమైన తెలంగాణ బిల్లును హుందాగా, గర్వంగా కాకుండా టీవీ ప్రసారాలు నిలిపేసి, ఆఖరి లోక్ సభ సమావేశాల్లో హడావిడిగా, కనీస చర్చ కూడా లేకుండా, దొంగచాటుగా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ఆయన ప్రశ్నకు ఇప్పటికీ బదులిచ్చిన వారు లేరు.
          ఆంధ్రోడు అనే మాట తెలంగాణలో తిట్టుగా ఎలా మారిందంటే సమాధానం చెప్పేవారెవరు. రాజకీయ అవసరాల కోసం రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రగల్చిన నాయకులు.. ఇప్పుడు ఆ జనాల మధ్య సఖ్యత ఎలా సాధిస్తారు. ప్రాంతాలుగా విడిపోదాం.. మనుషులుగా కలిసుందాం అని పదేపదే వల్లెవేసే నాయకులు దాని కోసం ఇప్పటి వరకు ఏం చేశారు? హైదరాబాద్ లో సీమాంధ్రుల రక్షణకు మాదీ పూచీ అని టీఆర్ఎస్ నాయకులు పదేపదే హామీలు ఇస్తున్నారంటే దానర్థం... మీరు ప్రమాదంలో ఉన్నారని.. దాడులు జరుగుతాయి అనా.. అనే సగటు సీమాంధ్రుడి భయాలను పవన్ ప్రసంగం పట్టి చూపింది. దేశానికి పట్టిన శని కాంగ్రెస్ అనే పవన్ వ్యాఖ్యాలతో విభేదించే వారు ఉన్నా... అదెంత సత్యమో ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది.
  మంచి విద్య, వైద్యం, భద్రత ఏ వ్యక్తైనా ప్రభుత్వం నుంచి కోరుకునేవి ఇవే. జనసేన మేనిఫెస్టో వీటికి భరోసా ఇచ్చింది. మేనిఫెస్టో అంటే ఉచిత హామీలు, వరాలు అనే భ్రమలో ఉన్న నాయకులు.. పవన్ పార్టీకి సరైన మేనిఫెస్టో లేదని విమర్శించడం అత్యంత సహజమైన విషయం. రాజకీయం అంటే ఎమ్మెల్యేగానో, ఎంపీగానో.. ఇవి కుదరకపోతే దొడ్డిదారిన పెద్దల సభకు వెళ్లడం అనుకునే సోకాల్డ్ నాయకులు..  పవన్ ఎన్నికల్లో నిలుస్తాడా.. ఒకవేళ నిలిస్తే గెలుస్తాడా.. ఓడినా డిపాజిట్లు వస్తాయా అని ప్రశ్నించడంలో వింతేమీ లేదు. వాళ్ల నుంచి ఆ ప్రశ్నలు ఎదురవ్వని సందర్భంలో మాత్రమే కంగారు పడాలి.. ఎక్కడ విజ్ఞత పెరిగిపోయిందేమోనని.
  మొత్తంగా పడికట్టు పదాలు, వ్యక్తిగత విమర్శలు, తిట్లు, శాపనార్థాలు, ఉచిత వరాలు లేని పవన్ ప్రసంగం చాలా మందికి చప్పగా అనిపించి ఉండవచ్చు. కుర్రాళ్ల అరుపులు, కేకల్ని చూసి వృద్ధనాయకులు చిద్విలాసంగా నవ్వుకోనూవచ్చు. అవివేకం వల్లో, అజ్ఞానం వల్లో, అనుభవం రాహిత్యం వల్లో..సోకాల్డ్ నాయకుల ప్రసంగానికి సుదూరంగా సాగిన పవన్ స్పీచ్.. ఒక సగటు మనిషి హృదయానికి అతి సమీపంగా చేరింది.

1 comment:

 1. పవన్ నాయకుడా కాదా అనేది ప్రక్కన పెడితే - మీరన్నది అన్ని విధాలా నిజం. కెసిఆర్ అండ్ కో ని విమర్శించే ధైర్యం వున్న నటుడ్ని గానీ, వేరెవరైనా సెలెబ్రిటీ ని గానీ ఇంకొకర్ని చూపించండి?
  ఈ విషయం లో తప్పక పవన్ ని అభినందించాల్సిందే. వ్యక్తిగత ప్రయోజనాలని ప్రక్కన బెట్టి - పర్సనల్ విషయాలలో రాబోయే విమర్శల్ని కూడా లెక్క చెయ్యకుండా ధైర్యంగా నిలబడటం నిస్సంశయంగా చాల గొప్ప విషయం. అనేకమంది అనేక విధాలుగా అతన్ని విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళలో ఎంతమంది సచ్చరితులున్నారనేది వాళ్ళ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఖచ్చితంగా అతను వెలిబుచ్చింది ముమ్మాటికీ సామాన్యుడి స్వగతమే...

  నిజాయితీగా మాట్లాడే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో పైకొచ్చిన దాఖలాలు అతి స్వల్పం -
  better he canvass with the single motto / objective ... reject congress - elect anybody ... because ...
  even if he forms a political party and try to do anything...
  people will ditch him anyway...

  ReplyDelete