బొత్స బీజేపీలో చేరతాడా?


పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అంతేకాదు కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీలో చేరతారని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. బీజీపీ అధినాయకులతో బొత్స మంతనాలు చేస్తున్నారని, తనతో పాటు తన కుటుంబంలోని పలువురికి టిక్కెట్లు కోసం చర్చిస్తున్నారని, త్వరలోనే పార్టీ జంప్ చేయడం ఖాయమని పుకార్లు షికార్లు చేశాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోకుంటేనే బీజేపీలో చేరతానని బొత్స షరతు పెట్టినట్టు కూడా చెబుతున్నారు. అయితే ఇవన్నీ రూమర్సేనని కొంతమంది కొట్టి పారేస్తున్నప్పటికీ నిప్పు లేనిదే పొగెలా వస్తుందనే వారూ ఉన్నారు. ఏదేమైనా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించిన పీపీసీ రథ సారథి బొత్స సత్యనారాయణ పార్టీ మార్పు ప్రచారం ఒక్కసారిగా రాజకీయ వర్గాలను కుదిపేసింది. అసలు బొత్స పార్టీ ఎందుకు మారుతున్నాడంటే వింత కారణాలు వినిపిస్తున్నాయి. రోజుకొకరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు జారిపోవడంతో బొత్స ఒంటరవుతున్నారనే మనస్తాపానికి గురవుతున్నారు. కుటుంబానికి చెందిన ప్రజాప్రతినిధులు, మరో ఐదేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి తప్ప మరెవరూ ఆయనతో  ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో  ఆయన పరిస్థితి దయనీయంగా మారిందని అంటున్నారు. దీనికి తోడు ఎక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవడానికి కూడా బొత్స కష్టపడాల్సి వస్తోంది. శృంగవరపుకోటలో పోటీ చేస్తారని ఒకసారి, చీపురుపల్లిలో అని మరోసారి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి  అని ఇంకోసారి ప్రచారం జరిగింది.  తర్వాత విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని మరో వాదన వినిపించింది.  ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లోనే కొనసాగితే గడ్డు పరిస్థితులు తప్పవని ఆయన అంచనావేసుకున్నట్టున్నారు. దాంతో బీజేపీలో చేరాలనే ఆలోచన వచ్చిందంటున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. తమ పార్టీ జాతీయ నేతలతో సత్తిబాబు టచ్‌లో ఉన్నమాట వాస్తవమేనని కిషన్ రెడ్డి చెప్పి బొత్సను మరింత ఇరుకున పెట్టారు. దాంతో మన బొత్సబాబు స్పందించాల్సి వచ్చింది. తనదైన స్టైల్లో ఈ వార్తలను ఆయన ఖండించారు కూడా. ఇదంతా తనపై కుట్రపూరితంగా జరుగుతుందని కూడా అన్నారు. రాజకీయ నేతల చేష్టలకు, మాటలకు పొంతన ఉండదనేది తెలిసిన విషయమేకదా? బొత్స గారి విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment