Video Of Day

Breaking News

సీపీఎం ఒంటరి పోరు?


వచ్చే సార్వత్రిక సంగ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండే పార్టీలతో పొత్తు కుదుర్చుకుందామనుకున్నా అది నెరవేరలేదు. తెలంగాణలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరగడంతో టీఆర్ఎస్‌తో పొత్తుకు సీపీఎం ప్రయత్నించింది. అయితే టీఆర్ఎస్ నుంచి సరైన స్పందన రాలేదు. ఏ పార్టీ ముందుకు రాకపోయే సరికి సీపీఎం కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలంగాణలో 17 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలను ప్రకటించింది. వాటిలో 3 పార్లమెంటు, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు బుధవారం విడుదల చేశారు. ఈ నెల 31న తుది జాబితా విడుదల చేస్తామన్నారు. పార్లమెంటు స్థానాలకు సంబంధించి.. ఖమ్మం నుంచి ఎండీ అఫ్రోజ్ సమీనాను, నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, భవనగిరి నుంచి మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములును బరిలోకి దించనున్నట్లు వీరభద్రం తెలిపారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి.. భద్రాచలం నుంచి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మధిర నుంచి లింగాల కమల్‌రాజు, పాలేరు నుంచి పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి పగడాల యాదన్నల పేర్లు ఖరారయ్యాయి.

No comments