Video Of Day

Breaking News

ఎన్నికల బరిలో సినీ తారలు!

వచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వివిధ పార్టీల తరపున సినీతారలు బరిలో దిగనున్నారు. మన రాష్ర్టం నుంచి చూస్తే సినీనటుడు, ప్రముఖ నిర్మాత మురళీమోహన్ టీడీపీ నుంచి రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేయనున్నారు. రెబల్ స్టార్ కష్ణం రాజు.. బీజేపీ తరపున కాకినాడ నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సహజనటి జయసుధ దాదాపు కాంగ్రెస్ నుంచే మళ్లీ సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయొచ్చు! ప్రముఖ హాస్య నటుడు ఆలీ గుంటూరు తూర్పు లేదా రాజమండ్రి స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రిన్స్ మహేశ్ బాబు బాబాయ్, నిర్మాత ఆదిశేషగిరిరావు తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి దాదాపు సిద్ధమైనట్లే! మరో హాస్య నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ టీడీపీ తరపున మెదక్ జిల్లాలోని ఆంథోల్ నుంచి పోటీకి దిగే అవకాశాలున్నాయి. "జనసేనాని' పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఆయన పోటీ చేయాలనుకుంటే కాకినాడ లేదా మల్కాజ్ గిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేయొచ్చు!
కర్ణాటక నుంచి ప్రముఖ సినీనటి రమ్య దివ్య స్పందన మరోమారు మాండ్య నుంచి పార్లమెంటుకు పోటీ చేయనున్నారు. తన నడుమందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన నగ్మా మీరట్ (ఉత్తర్ ప్రదేశ్) నుంచి, సోగ కళ్ల సుందరి సోనాక్షి సిన్హా తండ్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్నసిన్హా బీహార్ లోని పాట్నా సాహిబ్ నుంచి, మరో బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. మరో ప్రముఖ నటి జయప్రద రాఫ్రీయ లోక్ దళ్ తరపున ఉత్తర ప్రదేశ్ నుంచి పోటీ చేయనున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సతీమణి, ప్రముఖ కిరణ్ ఖేర్ బీజేపీ తరపున పంజాబ్ లోని చండీగడ్ నుంచి పార్లమెంటుకు పోటీ చేయనున్నారు. మరో ప్రముఖ నటి మూన్ మూన్ సేన్ తణ్ మూల్ కాంగ్రెస్ తరపున బెంగాల్ నుంచి పోటీకి రెడీగా ఉన్నారు. చూద్దాం వీరిలో ఎవరిని విజయం వరిస్తుందో!

No comments