ఎన్నికల బరిలో వారసులురానున్న పార్లమెంట్, శాసనసభల ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నేతలు, వారి వారసులు, బంధువులు బరిలో దిగనున్నారు. ఉత్తరాంధ్రలో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బొత్స ఝాన్సీ, చీపురు పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె భర్త బొత్స సత్యనారాయణ పోటీ చేయడం దాదాపు ఖాయం. విశాఖ జిల్లాలో దాడి వీరభద్రరావు అనకాపల్లి నుంచి, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ అదే జిల్లాలో ఏదైనా నియోజకవర్గం నుంచి వైకాపా తరపున అసెంబ్లీకి పోటీ చేయొచ్చు! అదేవిధంగా శ్రీకాకుళం నుంచి దివంగత ఎర్రంనాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడు లోక్ సభకు, ఎర్రం నాయుడి సోదరుడు అచ్చెం నాయుడు అసెంబ్లీకి తెలుగుదేశం నుంచి పోటీకి రెడీగా ఉన్నారు. ఎర్రం నాయుడి వియ్యంకుడు ఆదిరెడ్డి అప్పారావు వైకాపా తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక ఏలూరులో సిట్టింగ్ ఎంపీ కావూరి సాంబశివరావు పార్లమెంటుకు, ఆయన కుమార్తె శ్రీనగి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విజయవాడ తూర్పు నుంచి దేవినేని నెహ్రూ అసెంబ్లీకి, ఆయన కుమారుడు అవినాశ్ పార్లమెంట్ కు పోటీ చేయాలనే తలంపుతో ఉన్నారు. నర్సరావు పేట నుంచి మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆయన బావ అయోధ్య రామిరెడ్డి తెలుగుదేశం, వైకాపాల తరపున లోక్ సభ బరిలో నిలవనున్నారు! గుంటూరు పార్లమెంట్ నుంచి సినీ హీరో మహేశ్ బావ గల్లా జయదేవ్, ఆయన తల్లి గల్లా అరుణకుమారి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి అసెంబ్లీకి సిద్ధమవుతున్నారు. అనంతపురం నుంచి జేసీ దివాకరరెడ్డి పార్లమెంటుకు, ఆయన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి తాడిపత్రి నుంచి అసెంబ్లీకి పోటీపడాలనే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైకాపా తరపున బరిలో నిలవనున్నారు. ఇక నంద్యాల లోక్ సభ నియోజక వర్గం నుంచి భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన భార్య శోభ వైకాపా తరపున పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నెల్లూరులో మేకపాటి రాజమోహనరెడ్డి లోక్ సభకు, ఆయన సోదరుడు చంద్రశేఖర రెడ్డి వైకాపా నుంచి ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ పడనున్నారు. నెల్లూరు జిల్లాలోనే ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారు. నెల్లూరు జిల్లాలోనే తెలుగుదేశం తరపున చంద్రమోహన్ రెడ్డి, ఆయన మేనల్లుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వేర్వేరు పార్టీల తరపున బరిలో ఉండనున్నారు. కడప జిల్లాలో పులివెందుల నుంచి వైకాపా అధినేత జగన్, కడప లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆయన కజిన్ అవినాష్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా జగన్ సోదరి షర్మిల మల్కాజ్ గిరి లేదా ఖమ్మం లేదంటే విశాఖ పట్నం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ మేనమామ కడప మాజీమేయర్ రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో బాపట్ల లోక్ సభ నియోజక వర్గం నుంచి పనబాక లక్ష్మి, ఆయన భర్త పనబాక కష్ణయ్య నెల్లూరు జిల్లా గూడూరు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇలా ఎంతోమంది నేతలు, వారి వారసులు, బంధువులతో ఎన్నికలు కలకలలాడనున్నాయి. వీరిలో కొందరు ఒకే పార్టీ తరపున, మరికొందరు వేర్వేరు పార్టీల తరపున బరిలో దిగుతున్నారు. మరికొందరు ఒకరిపై మరొకరు పోటీకి రెడీగా ఉన్నారు. చూద్దాం విజయం ఎవరిని వరిస్తుందో!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment