Video Of Day

Breaking News

శ్రీవారి సన్నిధి సమీపానికి చేరుతున్న అగ్ని కీలలు

/fire-in-sheshachalam

శేషాచలం కొండల్లో... తిరుపతి-కడప మార్గంలోని 'మంగళం' గ్రామ సమీపంలో మూడు రోజుల క్రితం రాజుకున్న చిచ్చు ఇప్పుడు దావానంలా వ్యాపిస్తోంది. శ్రీవారి సన్నిధి అయిన తిరుమల సమీపానికి చేరింది. ఉత్తర దిశగా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. గోగర్భం డ్యామ్‌ను ఆనుకొని ఉన్న కాకుల కోన మార్గమధ్యంలోని అడవిని దహించి వేస్తున్నాయి. సమీపంలోని విండ్ పవర్ కేంద్రం జనరేటర్లు, కేబుళ్లు ఈ మంటల్లో కాలిపోయాయి. బుధవారం ఉదయం మంటలను అదుపు చేయడానికి వెళ్లిన వంద మంది ఆ మంటల్లోనే చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వాహనాలతో వెళ్లి మంటలను ఆర్పుతూ వెళ్లి వారిని రక్షించాల్సి వచ్చింది. వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి బూడిదైంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలకు పెనుగాలులు తోడయ్యాయి. దాంతో అగ్నికీలలు వేగంగా విస్తరిస్తున్నాయి. 300 మీటర్ల వెడల్పుతో ఉత్తర, దక్షిణ మార్గంలో మంటలు వ్యాపిస్తున్నాయి.

మంటలను ఆర్పేందుకు 500 మంది ఎస్పీఎఫ్‌ దళాలను, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది, శకటాలను రంగంలోకి దించారు. అగ్ని కీలలు తిరుమల వైపునకు రాకుండా అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి నేలపై ఎండు ఆకులను తొలగిస్తున్నారు. పార్వేట మండపం వద్ద ఎక్కువ మంది సిబ్బందిని కేంద్రీకృతం చేశారు. సైనిక దళాల ప్రధానాధికారిని, నౌకాదళ అధిపతిని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్లో సంప్రదించారు. రసాయన నురగల ద్వారా మంటలను ఆర్పేందుకు 2సీ-130 తరహా హెలికాప్టర్లను రంగంలోకి దించాలని అభ్యర్థించారు. అందుకు వారు అంగీకరించారు. మంటలు చల్లార్చేందుకు గురువారం 4 హెలీకాఫ్టర్లు పంపనున్నట్లు వాయుసేన  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి తెలిపింది. రక్షణ శాఖ నుంచి 100 మంది సైన్యాన్ని పంపనున్నారు. అటవీ, అగ్నిమాపక శాఖల డైరక్టర్‌ జనరల్స్‌ గురువారం తిరుమలకు వచ్చి పరిస్థితిని పరిశీలిస్తారు. 

1 comment:

  1. ఆ క్షేత్రంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న తప్పిదాలను, వాటిని కప్పిపుచ్చే వ్యవహారాలనూ, ఆలయ పద్ధతుల మర్యాదనూ, దేవదేవుని గౌరవాన్నీ కాపాడడంలో విఫలమైన వ్యవస్థతోపాటు దేవదేవునికి సేవకులుగా వ్యవహరించాల్సినవారు ఆయనను వదిలి ధనబలజనాధికారమున్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నతీరునూ, అది ఆపలేని ప్రభుతనూ, ప్రజలనూ చూసి వీరి వల్ల కాదని కన్నెర్ర జేసి తానే అగ్నిసంస్కారంతో ఏడుకొండలనీ ప్రక్షాళిస్తున్నాడా అనిపిస్తోంది.... అందరినీ క్షమించి దేవదేవుడు శమించాలని కోరుకోవడం తప్ప సామాన్యులుగా ప్రస్తుతం చేయగలిగింది లేదు, కనీసం భవిష్యత్తులోనైనా ఆ క్షేత్ర, ఆలయ మర్యాదలను భంగపరిచేవారి తాటతీసే గట్టి వ్యవస్థ ఏర్పడాలని కోరుకుంటూ...

    ReplyDelete