కిరణ్‌కు శైలజానాథ్ షాక్?


విడిపోయిన రాష్ట్రాలను మళ్లీ కలుపుతానంటూ విచిత్రమైన నినాదంతో పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పుడే తొలి షాక్ తగలనుందా? ఆయన పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడైన సాకే శైలజానాథ్ కిరణ్ కు చేయి ఇవ్వనున్నాడా? ! అనంతపురం జిల్లాకు చెందిన ఈ శైలజానాథ్ అతి త్వరలోనే కిరణ్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా? అవుననే అంటున్నాయి... తాజా రాజకీయ పరిణామాలు. అంతేకాదు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన శైలజానాథ్ సోమవారం తిరిగి వచ్చారు. అక్కడే ఉండి అన్ని రాజకీయాలు చక్కదిద్దుకున్నారు. టీడీపీలో శైలజానాథ్ చేరిక ప్రాథమికంగా ఖరారైందని... లాంఛనంగా ప్రకటించడం ఒక్కటే మిగిలిందని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే పాపం కిరణేమో తమ పార్టీ ఉపాధ్యక్షుడిగా శైలజానాథ్ ను ఎప్పుడో ప్రకటించాడు. శైలజానాథ్ మంగళవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ...  తన వెంట నడిచిన అన్ని వర్గాల ప్రజలనూ సంప్రదించి... ఏ పార్టీలో చేరబోయేదీ గురువారం ప్రకటిస్తాననడం గమనార్హం. 2009 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గంలో శైలజానాథ్‌పై టీడీపీ అభ్యర్థిగా శమంతకమణి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం శింగనమలలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. అందువల్ల... శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు సిద్ధమైతే, చేర్చుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయనను ఆహ్వానిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment