Video Of Day

Breaking News

కిరణ్‌ కొత్త పార్టీ

రాష్ట్ర విభజనను వ్యతిరేకించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, అభివృద్ధి, రక్షణలే లక్ష్యాలుగా పార్టీని పెడుతున్నట్లు ఆయన గురువారం ప్రకటించారు. కాంగ్రెస్‌ బహిష్కృత ఎంపీలు సాయిప్రతాప్‌, సబ్బం హరి, హర్షకుమార్‌, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, మాజీ మంత్రి పితాని సత్యనారాయణతోపాటు రెడ్డపరెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలను ఈ సందర్భంగా విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు సీమాంధ్ర, తెలంగాణ అంటూ ఇప్పటికీ రెండుకళ్ల సిద్ధాంతంతో వెళుతున్నారని కిరణ్‌ విమర్శించారు. ఆయన అనేక అంశాల్లో స్వలాభమే లక్ష్యంగా వ్యవహరించారని, కనీసం శాసనసభలో తన అభిప్రాయం కూడా చెప్పలేదని అన్నారు. ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు తప్ప... తెలుగు జాతిని పట్టించుకోలేదని ఆక్షేపించారు. వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పైకి సమైక్యవాదం అంటూ... లోపల మాత్రంతొందరగా రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారన్నారు. రాష్ట్ర విభజన అంశం ఇంకా తేలకముందే పార్టీ ప్లీనరీ ఏర్పాటుచేసుకుని... 50రోజుల్లో తాను ముఖ్యమంత్రి అవుతానని జగన్‌ ప్రకటించుకున్నారని గుర్తుచేశారు. జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌, భాజపాలు కలిసి తెలుగు ప్రజలను అన్యాయం చేశాయన్నారు. భాజపా నేత నరేంద్రమోడీ పురుడుపోసి తెలంగాణ ఇచ్చి తల్లిని చంపేశారని వ్యాఖ్యానించారని, ఎల్‌.కె.అద్వానీ 50ఏళ్ల పార్లమెంటరీ చరిత్రలో ఇంత తప్పుల తడక బిల్లును ఎప్పుడూ చూడలేదని విమర్శించారని అన్నారు. అలాగే ప్రధాని మన్మోహన్‌సింగ్‌... ఎంపీలు వెల్‌లోకి వెళ్లేటప్పటికి తన మనసు గాయపడిందని అన్నారన్నారు. కానీ వీళ్లెవరూ తెలుగువారి పక్షాన మాత్రం నిలవలేదని చెప్పారు. అభ్యర్థులెవరూ నచ్చలేదని చెప్పేందుకు తాజాగా ఈవీఎంలలో నోటా మీట పెట్టారని చెబుతూ... ఆత్మాభిమానం ఉన్న తెలుగువారెవరూ తెలుగుజాతిని మోసపుచ్చిన పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు, వారి ఆలోచన మేర నడిచేందుకు, వారి మనసుల్ని అర్థం చేసుకుని వ్యవహరించేందుకు కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. రాజమండ్రిలో ఈ నెల 12వ తేదీన సాయంత్రం 4గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, అందులో ఇతర విషయాలన్నింటినీ ప్రకటిస్తామని తెలిపారు. తెలుగువాడి గుండె చప్పుడే తమ పార్టీ విధానమన్నారు. రెండు ప్రాంతాల్లోనూ పోటీచేస్తారా? అని విలేకరుల ప్రశ్నించగా... ''ఎక్కడెక్కడ అవసరమో అక్కడ పోటీచేస్తాం''అని కిరణ్‌కుమార్‌రెడ్డి బదులిచ్చారు. ఇప్పుడే అంతా మాట్లాడుకుని పార్టీ స్థాపించాలని నిర్ణయించామని, అన్ని అంశాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రవిభజన జరిగిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. విభజనకు కారణ మైన పార్టీలే అధికారం కోసం ఆరాటపడుతుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు.ముఖ్యమంత్రిగా ఉండగా తాను తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేసుకోవచ్చని కిరణ్‌కుమార్‌రెడ్డి సవాలు విసిరారు. అధికారం చివరిలో ఫైళ్లపై సంతకాలు పెట్టి రూ.5వేల కోట్లు సంపాదించారని కొందరు గవర్నర్‌కు ఫిర్యాదు ఇచ్చారు కదా? అని ప్రశ్నించినప్పుడు... ''ఎవరికైనా ధైర్యముంటే నా నిర్ణయాలపై కోర్టుకు వెళ్లొచ్చు. ఆఖరి రోజుల్లో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్‌ సిటీ భూముల కేటాయింపును, నిజాం చక్కెర కర్మాగారం అమ్మకాన్ని, సోంపేటలో భూముల కేటాయింపును రద్దు చేశాను. ఇవన్నీ మీకూ తెలియదు. నేను చేసిన పనులపై విచారించేందుకు గవర్నర్‌ ఎవరు? ఎన్నికైన ప్రభుత్వం వచ్చాక నా మూడేళ్ల పాలనలోని నిర్ణయాలపై విచారణ చేసుకోవచ్చని సవాల్‌ చేస్తున్నా? ఇక్కడెవరూ భయపడేవారు లేరు'' అని పేర్కొన్నారు. పిచ్చికూతలు కూయడం కాకుండా ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టొచ్చని సవాల్‌ చేశారు. 40-50ఏళ్ల నుంచి తన కుటుంబం రాజకీయాల్లో ఉందని, ఎన్నడూ మచ్చ పడలేదని, మచ్చ రాబోదని అన్నారు. రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఎవరని ప్రశ్నించగా... రాజకీయాల్లోకి వచ్చాక అంతా ప్రత్యర్థులేనని బదులిచ్చారు. ఎంతమంది నేతలు నాతో వస్తారో మీకే తెలుస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూడేళ్లు అధికారం అనుభవించి చివరిలో పదవి వదిలి పార్టీ పెట్టారన్న విమర్శలున్నాయి కదా అన్నప్పుడు...''ఆ చివరిలోనే ముఖ్యమంత్రి పదవికోసం ఎంతమంది పోటీ పడ్డారో, ఎంతమంది ఢిల్లీ పరుగెత్తారో మీరే రాశారు కదా?''అని బదులిచ్చారు. పదవుల కోసమో, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యేందుకో పార్టీ పెట్టడం లేదన్నారు. అలాగని తామేమీ సన్యాసం తీసుకోవడం లేదని కూడా స్పష్టం చేశారు. లగడపాటి రాజగోపాల్‌ను కూడా ఎన్నికల్లో పోటీచేయాలని ఒత్తిడి చేస్తున్నామన్నారు. మనస్సాక్షిగా సమైక్యాంధ్ర కోసం పోరాడామని, మోసం, కుట్రతో రాష్ట్ర విభజన జరిగిందని... ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీచేయాలని కోరుతున్నామని తెలిపారు. విభజనతో తన మనసు గాయపడిందని, తనతో ఉన్న నేతల మనసులూ గాయపడ్డాయని, అందుకే పార్టీ పెట్టామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ఆ పార్టీనే ఎదిరించామని చెప్పారు.రెండు రాష్ట్రాలను మళ్లీ కలుపుతామని చెప్తారా? అని ప్రశ్నించగా...''రెండు జర్మనీల మధ్య ఉన్న గోడను పగలగొట్టి ప్రజలే కలిపేశారు. ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య గోడ కూడా ఏం లేదు. ఆరోజు విడిపోతే రెండు ప్రాంతాలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పా. తెలంగాణలో తీవ్ర విద్యుత్‌ కొరత ఉంటుందన్నా. ఏమీ ఉండదు... చత్తీస్‌గఢ్‌నుంచి కొక్కేలు వేసుకుని విద్యుత్‌ తెచ్చుకుంటామని కొందరు నేతలన్నారు. ఇప్పుడు వాళ్లే 15వేల మెగావాట్ల విద్యుత్‌ కొరత ఉంటుందని చెప్తున్నారు. నేను ఆరోజన్నది 7వేల మెగావాట్ల కొరత ఉంటుందనే. వీళ్లు 15వేల మెగావాట్లు అంటున్నారు. మరి చత్తీస్‌గఢ్‌నుంచి కొక్కేలు ఏమయ్యాయి?''అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశానికి రాయపాటి సాంబశివరావు రావడం ఆలస్యమైందని, శైలజానాథ్‌ చికిత్సకోసం వెళ్లడంతో రాలేదని, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆస్పత్రికి వెళ్లడంతో రాలేకపోయారని తెలిపారు.

No comments