ఆపరేషన్ శేషాచలం


శేషాచలం అడవుల్లో దావానలాన్ని చల్లార్చేందుకు చేపట్టిన 'ఆపరేషన్ శేషాచలం' విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం మొదలైన మంటలు బుధవారానికి ఉధృతంగా మారడంతో, వాటిని ఆర్పేందుకు నాలుగు హెలికాప్టర్లతో కేంద్ర రక్షణ శాఖ గురువారం రంగంలోకి దిగింది. వాటిలో రెండు హెలికాప్టర్లు ఏరియల్ సర్వే చేస్తూ సందేశాలు అందిస్తుంటే.. బాంబీ బకెట్లు ఉన్న మరో రెండు హెలికాప్టర్లు వాటిని అనుసరిస్తూ మంటలపై నీటిని కుమ్మరించాయి. కుమారధార, పసుపుధార జలాశయం నుంచి బెలూన్ నిండా 3 వేల లీటర్ల నీటిని నింపుకొని తొలుతగా పొగలు, మంటలు వస్తున్న ప్రాంతంలో నీటిని చిమ్మారు. కొంతసేపటికి తుంబురుతీర్థం ప్రాంతంలో మంటలు ఎక్కువగా వ్యాపిస్తుండడంతో దిశ మార్చుకుని మరోసారి జలాశయంలో నీటిని నింపుకొని అక్కడ మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఇలా గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఒక్కో హెలికాప్టర్ ద్వారా 15 విడతలకుపైగా నీటిని మంటలపై కుమ్మరించారు. గురువారం రాత్రి సమయానికి.. పాపవినాశం సమీపంలో 200 అడుగుల వెడల్పుతో 2 కిలోమీటర్ల పొడవున అగ్ని కీలలు విస్తరించి ఉన్నాయి. వీటిని అదుపులోకి తేవడంతో పాటు అగ్ని ప్రమాదం సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో నీటిని కుమ్మరించి పెను ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే కార్చిచ్చును ఆర్పేందుకు హెలికాప్టర్లను వినియోగించడం భారతదేశ చరిత్రలోనే ఇది తొలిసారి. అయితే అక్కడక్కడా ఇంకా మంటలు వ్యాపిస్తున్నందున  శేషాచల అడవుల్లో మంటలను ఆర్పే ఆపరేషన్ శుక్రవారం కూడా కొనసాగనుంది. ఆపరేషన్ పూర్తి చేశాకే హెలికాప్టర్లు తిరిగివెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ శుక్రవారం మంటలు అదుపు కాకుంటే.. మరో రోజు కూడా కొనసాగించే అవకాశాలున్నాయి.  ఇదిలా ఉంటే 460 హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం అగ్నికీలలకు ఆహుతైనట్లు సమాచారం. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment