Video Of Day

Breaking News

'మల్కాజ్' పై మనసు పారేసుకున్న రేవంత్!


తెలంగాణలో టీడీపీ-లోక్ సత్తా పొత్తుల నేపథ్యంలో... లోక్ సత్తా పార్టీ  జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి  పోటీ చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఈ వ్యవహారం అదే స్థానాన్ని ఆశిస్తున్న టీడీపీ అధికార ప్రతినిధి, టీడీపీ నేత రేవంత్ రెడ్డికి నచ్చలేదు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒకవేళ జయప్రకాశ్ నారాయణ్ పోటీ చేస్తే స్థానికులతోపాటు తానూ వ్యతిరేకిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రాంతమైన మల్కాజ్‌గిరిలో సీమాంధ్రులు, స్థానికేతరులు పోటీ చేయాలనుకోవడం సరికాదని విమర్శించారు. కష్ట పడి తెలంగాణ సాధించుకుంది దేని కోసమని ప్రశ్నించారు. స్థానికులకు అవకాశాల కోసమే తెలంగాణను సాధించుకున్నామని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే రేవంత్ వాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని భావిస్తున్నారు. లక్షల సంఖ్యలో సీమాంధ్ర ప్రాంత ఓటర్లు ఉండటం వల్లే మల్కాజిగిరి టీడీపీకి బలమైన సీటుగా గుర్తింపు పొందింది. అక్కడ టీడీపీ గెలుపు ఖాయమనే అనేక మంది నేతలు ఆ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు అక్కడి సీమాంధ్ర ఓటర్లలో ప్రతికూలతకు దారి తీశాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.ఈ సీటును ఆశిస్తున్న రంగారెడ్డి జిల్లా టీడీపీ నేతలు కూడా రేవంత్‌పై గురిపెట్టి మాట్లాడుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు ఆయన కూడా స్థానికేతరుడేనని, ఆ మాటలు ఆయనకూ వర్తిస్తాయని వారంటున్నారు. మొత్తానికి రేవంత్ వ్యాఖ్యలు ఆయనకే చిక్కు తెచ్చిపెట్టాయి.

No comments