Video Of Day

Breaking News

చేవెళ్ల చెల్లెమ్మకు చిక్కు!

sabita-karthik-chevella-mp-seat

చేవెళ్ల లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ సూదిని జైపాల్‌రెడ్డి పాలమూరు సీటుకుమారడం దాదాపు ఖాయం కావడంతో ఈ సీటుపై ఆశ పెట్టుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పెద్ద చిక్కు వచ్చి పడింది. తన రాజకీయ వారసుడిగా తనయుడు కార్తీక్‌రెడ్డిని చేవెళ్ల బరిలోకి దించాలని భావించిన చేవెళ్ల చెల్లెమ్మకు ఎదురు గాలి వీస్తుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ అన్న కాంగ్రెస్ హైకమాండ్ నిబంధన ఆమెకు పెద్ద గుదిబండగా మారుతోంది. కార్తీక్ పార్లమెంట్‌కు... తాను అసెంబ్లీకి పోటీచేయాలని నిర్ణయించుకున్న చేవెళ్ల చెల్లెమ్మకు నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పార్లమెంటుకు సబిత అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపుతుండడం మరో కొత్త చిక్కు వచ్చే అవకాశం ఉంది. తనకు జాతీయ రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదని, ఎంపీ సీటుకు తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆమె కోరిన విషయం తెలిసిందే. అదే సమయంలో రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్ తనకు ఖరారు చేయాలని అభ్యర్థించినట్లు సమాచారం.  ఇదిలావుండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సారి చేవెళ్ల నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని కార్తీక్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ వ్యూహంలో భాగంగానే గత ఆరు నెలలుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, తెలంగాణ నవ నిర్మాణ యాత్ర పేరిట 101కి.మీ. మేర పాదయాత్ర కూడా నిర్వహించారు. అయితే ఇద్దరిలో ఒకరికే టికెట్ అని అధిష్టానం స్పష్టం చేయడంతో సబిత, కార్తీక్‌లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు!!

No comments