మోడీ వివాహ వివాదం ముగిసినట్లేనా?


గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (63) తాను వివాహితుడినని తొలిసారి ప్రకటించారు. తన భార్య పేరును యశోదాబెన్ (62)గా పేర్కొన్నారు. అయితే భార్య ఆస్తుల వివరాలను పేర్కొనాల్సిన చోట మాత్రం ‘నా వద్ద సమాచారం లేదు’ అని రాశారు. 2012 అసెంబ్లీ ఎన్నికలు సహా గతంలో సమర్పించిన అన్ని ఎన్నికల అఫిడవిట్‌లలో మోడీ తన వైవాహిక స్థితి గురించి వివరాలు పొందుపరచాల్సిన చోటును ఖాళీగా వదిలేసేవారు. మోడీ సమర్పించిన అఫిడవిట్‌ను వడోదరా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నోటీసు బోర్డులో పెట్టింది. ఇదిలా ఉంటే మోడీ వివాహాన్ని సుమారు 50 ఏళ్ల కిందట జరిగిన సామాజిక లాంఛనంగానే చూడాలని మోడీ పెద్దన్నయ్య సోమాభాయ్ కోరారు. పెద్దగా చదువుకోని తమ తల్లిదండ్రులు పేదరికం కారణంగా మోడీకి చిన్న వయసులోనే పెళ్లి చేశారన్నారు. స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుని నుంచి స్ఫూర్తి పొందిన మోడీ...వసుదైక కుటుంబమనే సిద్ధాంతాన్ని నమ్మి పెళ్లయిన వెంటనే దేశ సేవ కోసం ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి చిన్న వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌కే జీవితాన్ని అంకితం చేశారన్నారు. మోడీ నాటి నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నారని, టీచర్‌గా పనిచేసి రిటైరైన యశోదాబెన్ ప్రస్తుతం తండ్రి వద్దే ఉంటున్నారన్నారు. మోడీ వివాహం వివరాలను అఫిడవిట్లో పేర్కొనడంతో పెళ్లి విషయాన్ని ఇన్నాళ్లూ రాద్ధాతం చేస్తూ వచ్చిన ప్రతిపక్షాలకు మోడీ చెక్ పెట్టారు. ఈ వివాదానికి ఇంతటితో తెరదించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment