బ్యాలెట్‌లో శోభానాగిరెడ్డి పేరు ఉంటుంది!

shobha nagi reddy name on ballet papers

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి పేరు బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాక శోభానాగిరెడ్డికి అత్యధిక ఓట్లు వస్తే ఆమెను గెలిచినట్లు ప్రకటించి, తిరిగి ఎన్నిక నిర్వహిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారుల నిర్ణయాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. అయితే ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు మాత్రం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆళ్లగడ్డ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి గత నెల 24న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. వచ్చే వారం జరగనున్న ఎన్నికల్లో ఆమె పేరు యథాతథంగా కొనసాగడంపై సీఈసీ వివరణ ఇచ్చింది. శోభానాగిరెడ్డికి అత్యధిక ఓట్లు వస్తే ఆమెను గెలిచినట్లు ప్రకటించి, తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి కె.ఎఫ్. విల్ఫ్రెడ్, అండర్ సెక్రటరీ దురుసౌ థంగ్ ఇచ్చిన వివరణలను సవాలు చేస్తూ కర్నూలు జిల్లా, రుద్రవరం మండలం, ఎర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన బి.హర్షవర్ధన్‌రెడ్డి, చిన్నకంబలూరు గ్రామానికి చెందిన జంగా వినోద్‌కుమార్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హౌజ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలను జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఉదయం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎమ్మెస్ ప్రసాద్ వాదనలు వినిపించగా, కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అవినాష్ దేశాయ్ వాదించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment