చంద్రబాబుకి కేసిఆర్ సలహా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట్లో జాతకాలు, పంచాంగాల, సుముహూర్తాలపై పెద్దగా నమ్మకమున్నట్లు కనిపించేవారు కాదు. అయితే పదేళ్ల పాటు అధికారానికి దూరమైన ఆయన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని బలంగా విశ్వసిస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవం, పదవీ బాధ్యతలు చేపట్టడం వంటివి ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ముహూర్తాలు, జాతకాలు, సంఖ్యాశాస్త్రం, యాగాలు వంటి వాటిపైనే కాదు..వాస్తు పట్టింపు కూడా బాగానే ఉంది. అయితే ఆదివారం ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్‌లో సమావేశమైనపుడు కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపిక గురించి చంద్రబాబుకు వాస్తుపరమైన సూచనలు చేశారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, అమరావతి మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కెసిఆర్ సలహా ఇచ్చారు. కృష్ణా నది ప్రవహించే ఈ ప్రాంతం మధ్య రాజధాని నిర్మాణం వాస్తుపరంగా అద్భుతంగా ఉంటుందని చంద్రబాబుకు కెసిఆర్ సూచించారు. ఇదే విషయాన్ని గురించి చంద్రబాబును ఆ తర్వాత విలేకరులు అడిగినప్పుడు, ‘‘కెసిఆర్ నుంచి సలహా తీసుకోవడంలో తప్పేముంది? ఆయన కూడా తెలుగువారే కదా!’’ అని బదులిచ్చారు. మొత్తానికి స్నేహపూర్వక వాతావరణం ఉన్నప్పుడు మంచి చెడ్డలు మాట్లాడుకోవడం, సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం సహజమే..ఇదే వాతావరణం భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆకాంక్షిద్దాం
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment