అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేల వీరంగం

హైదరాబాద్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏది జరగకూడదదో అదే జరిగింది. ప్రజాప్రతినిధులమన్న స్పృహ కూడా లేకుండా వీధి రౌడీల్లా ప్రవర్తించారు ఇద్దరు ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఈ దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఇద్దరూ పరస్పరం చొక్కాలు పట్టుకుని ఘర్షణ పడ్డారు. 
ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అక్కడే ఉన్న మిగతా ప్రజాప్రతినిధులు నేతలను విడిపించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం, ఇటీవల కాలంలో జరిగిన హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ చెవిరెడ్డి భాస్కరెడ్డి అంటున్న సమయంలో, గతంలో జరిగిన హత్యలకు ఎవరు బాధ్యత వహించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగి చొక్కాలు పట్టుకున్నారు. 
దీంతో ఇతర ఎమ్మెల్యేలు వారిని అడ్డుకుని ఎటువంటి దాడులు జరుగకుండా ప్రయత్నించారు. దీనిపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకులకు వ్యక్తిగత విభేదాలు ఉంటే బయట చూసుకోవాలని, ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి, పరిష్కరించడానికి అసెంబ్లీ ఉందన్న విషయం గుర్తించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. జరిగిన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పి హుందాగా నడుచుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాతీర్పుపైన, అసెంబ్లీ పైన గౌరవం లేకపోతే ఆ వ్యవస్థ కుప్పకూలుతుందని పలువురు చెబుతున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment