Video Of Day

Breaking News

కరువును అంచనా వేసే శాటిలైట్

వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా కరువు సంభవించే అవకాశాలను ముందుగానే అంచనా వేయడంతోపాటు రైతులు అధిక దిగుబడి సాధించేందుకు దోహదపడే సరికొత్త శాటిలైట్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో భూసార తేమను పరిశీలించేందుకు అంతర్జాతీయ శాటిలైట్ వ్యవస్థగానీ, మరో స్థానిక వ్యవస్థగానీ లేదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు, రైతులు భూమిలో సెన్సర్లు పెడుతున్నప్పటికీ ఇవి పరిమిత వివరాలు మాత్రమే అందిస్తున్నాయి. పైగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో వీటి వినియోగం పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ వివరాలు, నీటి వనరుల లభ్యత గురించి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు నాసా సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ పాసివ్ (స్మాప్) శాటిలైట్ మిషన్ త్వరలో ఓ శాటిలైట్‌ను ప్రయోగించనుంది. 
ఈ శాటిలైట్‌ను రూపొందించిన పరిశోధకుల బృందంలో ఓ భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. భూఉపరితలంలో ఐదు సెంటీమీటర్ల లోతు వరకు ఉన్న తేమను గుర్తించేందుకు రెండు మైక్రోవేవ్ పరికరాలను శాస్త్రవేత్తలు ఉపయోగించనుంది. వీటిద్వారా సేకరించిన సమాచారంతో తొమ్మిది కిలోమీటర్ల పరిధిలోని తేమశాతాన్ని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు, మూడు రోజులకోసారి మ్యాపులను ఈ శాటిలైట్ అందజేస్తుంది. వర్షాధార పంటలు పండించే రైతులు భూమిలోని తేమ శాతాన్ని తెలుసుకోగలిగితే.. తమ భూముల్లో అత్యధిక దిగుబడి సాధించేలా ముందస్తు ప్రణాళిక వేసుకోగలరు అని వాటర్, కార్బన్ సైకిల్ శాస్త్రవేత్త నరేంద్రదాస్ తెలిపారు. స్మాప్ పరిశోధకుల బృందంలో ఒకరిగా ఉన్న ఆయన కాలిఫోర్నియాలోని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబరేటరీలో పనిచేస్తున్నారు.

No comments