Video Of Day

Breaking News

బెడిసి కొట్టిన పోలీస్ స్టోరీలు?

హైదరాబాద్ :
హీరోలు పోలీస్ డ్రెస్ వేసుకుంటే చాలు ఆ సినిమా దాదాపు హిట్టే అన్న సెంటిమెంట్ బెడిసికొట్టింది.  సాధారణంగా అన్ని వర్గాల, అన్ని భాషల ప్రజలకు  పోలీస్ స్టోరీలంటే చాలా ఇష్టం. ఈ విషయం గతంలో అనేక సందర్భాలలో రుజువైంది. కనిపించని నాలుగో సింహం పవరే వేరు. ఇక అభిమానులకైతే తమ హీరో పోలీస్ అధికారిగా గన్ పట్టుకొని విలన్స్ ను కాల్చేస్తుంటే ఆ ఉత్సాహం చెప్పనలవికాదు. మూస చిత్రాలు, కలగలుపు కథలతో రూపొందే మూవీలతో సిల్వర్ స్క్రీన్ పై పోలీస్ యూనిఫాం పవర్ మసకబారింది.
ఎనర్జిటిక్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ పోలీస్ డ్రెస్ వేస్తే ఆ కిక్కే వేరు. ఈసారి అన్ లిమిటెడ్ పవర్ చూపించడానికి మళ్లీ మాస్ పోలీస్ గా  ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఐతే, విక్రమార్కుడు, బలుపు సినిమాలను మిక్స్ చేసి బాబి డైరెక్ట్ చేసిన 'పవర్' మూవీ పోలీస్ పవర్ ని పూర్తిగా చూపించలేకపోయిందని అంటున్నారు. మెయిన్ స్టోరీలైన్ పక్కదారి పట్టిందని టాక్. మాస్ రాజా తన ఎనర్జీని చూపించాడు కానీ, పవర్ లో కొత్త వెలుగులు మిస్సయ్యాయని సగడు ప్రేక్షకుడు ఫీలవుతున్నాడు
అప్పటిదాగా అల్లరి చిల్లర పాత్రలతో సూపర్ హిట్స్ కొట్టిన రవితేజ. రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కుడు మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ట్రెమండస్ హిట్ అందుకున్నాడు. రాథోడ్ పాత్రలో అల్టిమేట్ పెర్ఫామెన్స్ చూపించాడు. పవర్ మూవీలో కూడా విక్రమార్కుడు రేంజ్ లో అదరగొట్టాలని చూశాడు. బలదేవ్ సహాయ్ పాత్రలో బెంగాల్ టైగర్ గా విలన్స్ ని బెంబేలెత్తించాలని ట్రై చేశాడు. ఐతే, రొటీన్ యాక్షన్ సీన్స్, పవర్ లేని డైలాగ్స్ వల్ల ఆ క్యారెక్టర్ కు రావాల్సిన హైప్ రాలేదని క్రిటిక్స్ అభిప్రాయం
పోకిరి, దూకుడు...ఈ రెండు సినిమాల్లోనూ మహేష్ పోలీస్ పొగరు చూపించాడు. పోకిరి బాక్సాఫీస్ రికార్డ్స్ ను తిరగరాస్తే, దూకుడు ఎదురులేకుండా దూసుకుపోయింది. అదే పోలీస్ సెంటిమెంట్ ను మహేష్ బాబు ఫాలో అయ్యాడు.  శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో వచ్చింది ఆగడు. ప్రిన్స్ ముచ్చటగా మూడోసారి పోలీస్ డ్రెస్ వేశాడు. ఎప్పటిలాగే మహేష్ మళ్లీ వన్ మేన్ షో చేశాడు. సూపర్ స్టార్ విసిరిన నాన్ స్టాప్ పంచ్ డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవతున్నారు. కానీ, ప్రేక్షకుల అసహనానికి గురవుతున్నారని కొన్ని సినిమా సమీక్షలు చెబుతున్నాయి.
మహేష్ బాబు సైలెంట్ గా ఉంటూ పంచ్ డైలాగ్స్ పేలిస్తే కొన్ని సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మహేష్ రూటు మార్చి ఊపిరి సలపకుండా డైలాగ్స్ చెప్పిన ఖలేజా ప్రేక్షకులకు మజా ఇవ్వలేదు. ఆగడు మూవీలో టైటిల్ తగ్గట్టే మహేష్ మాటలధాటి ఎక్కడా ఆగలేదు. పంచ్ ల మీద పంచ్ లతో మైండ్ బ్లాక్ చేశాడు ప్రిన్స్. అతడు తక్కువగా మాట్లాడితేనే ఎక్కవగా ఎక్కుతుంది. మహేష్ ఒక్కసారి డైలాగ్ చెబితే, వందసార్లు చెప్పినట్లే. అయితే  ఆగడులో వందసార్లు చెప్పేసరికి ఒక్కసారి కూడా ఎక్కలేదని విమర్శకుల అభిప్రాయం. సైలెంట్ గా వైలెంట్ సృష్టించినట్లు మహేష్ తక్కువ డైలాగ్స్ పేలిపోయే భావం వ్యక్తం చేస్తేనే ప్రేక్షకులు ఇష్టపడతారని అర్ధమవుతోంది.

No comments