గురజాడ స్వగ్రామంలో జయంతి వేడుకలు

విశాఖ :
తెలుగు పాఠక లోకానికి నవలను పరిచయం చేసిన ఘనత గురజాడ అప్పారావుదే. తెలుగు సాహిత్యాన్ని గ్రాంథికం నుంచి వచనం దిశగా మళ్ళించడంలో గురజాడ వారి పాత్ర ఎనలేనిది. సరళమైన పదాలతో, స్థానిక వ్యవహారికాలు, మాండలికాలతో ఆయన తెలుగు రచనను కొత్త పుంతలు తొక్కించారు. 'కన్యాశుల్కం'వంటి రచనతో సమాజంలోని మూఢాచారాలపై అందరిలోనూ ఆలోచన రేకెత్తించారు. అంతేగాకుండా, ముత్యాల సరాలు, పూర్ణమ్మ, కొండుభట్టీయం, లవణరాజు కల వంటి రచనలతో ప్రసిద్ధికెక్కారు. 'దేశమును ప్రేమించుమన్నా/మంచి అన్నది పెంచుమన్నా..' గీతం గురజాడ వారి కలం నుంచి జాలువారినదే. కన్యాశుల్కంలోని 'డామిట్! కథ అడ్డంతిరిగింది!' 'తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి', 'పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్' వంటి వాక్యాలు ఎంత ప్రాచుర్యం పొందాయో తెలిసిందే. నేడు ఆయన 152వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ సర్కారు గురజాడ వారి స్వగ్రామంలో జయంతి వేడుక అధికారికంగా నిర్వహించింది.
విశాఖ జిల్లా ఎస్.రాయవరంలోని గురజాడ ఇంటిలో మంత్రి కిమిడి మృణాళిని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గురజాడ రచనలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టేందుకు కృషిచేస్తానని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి అన్ని జిల్లాల్లోనూ గురజాడ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment