అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేయడం దండగ: టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

హైదరాబాద్ :
  పేద ప్రజలకు అతి తక్కువ ధరలో ఉపాహారం, భోజనం అందించేందుకు చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేయబోతున్న 'అన్న' క్యాంటీన్లపై సాక్షాత్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేనే విమర్శలకు తెరలేపారు. మధ్యాహ్న భోజన పథకాన్నే సరిగ్గా నిర్వర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు, 'అన్న' క్యాంటీన్లు అవసరమా? అని టీడీపీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కొన్ని పథకాలు తనకు ఏమాత్రం అర్థం కావడం లేదని... అందులో 'అన్న' క్యాంటీన్ల ఏర్పాటు ఒకటని ఆయన అన్నారు.
'అన్న' క్యాంటీన్ల నిర్వహణను ఇస్కాన్ కు అప్పజెప్పాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనను ఆయన తప్పుపట్టారు( ఇస్కాన్ మనదేశంలో అక్షయ పాత్ర అనే కార్యక్రమం ద్వారా ప్రతీ రోజు సుమారు 13లక్షల మంది పేదప్రజలకు మద్యాహ్న భోజనాన్ని అందిస్తోంది). ఇస్కాన్ అందిస్తోన్న భోజనంపై చాలా విమర్శలున్నాయని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం 'అన్న క్యాంటీన్ల' ఏర్పాటుకు తమిళనాడులోని 'అమ్మ క్యాంటీన్ల'ను ఆదర్శంగా తీసుకుంటుందని.... అక్కడ అన్నం, సాంబారులతో భోజనాన్ని కానిచ్చేస్తారని... ఆ పద్దతి ఇక్కడ ఏమాత్రం సరిపోదని ఆయన ఎత్తిచూపారు. తాము 2007 నుంచి తాడిపత్రిలో రోజుకి సుమారు 6,000 మందికి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని, ఒకసారి తాడిపత్రికి వచ్చి తాము చేపట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే... ఏర్పాట్లు ఎలా చేయాలో ప్రభుత్వానికి తెలుస్తోందన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment