Video Of Day

Breaking News

సాయం కోసం ఎదురుచూపులు

జమ్ము/ శ్రీనగర్, సెప్టెంబర్ 9: జోరువాన.. పోటెత్తిన వరదలు.. జమ్ముకశ్మీర్‌ను కకావికలం చేశాయి! అక్కడ ఎటుచూసినా భీతావహ దృశ్యాలే! ప్రస్తుతం వరదలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ పరసరాలన్నీ బురదతో నిండిపోయాయి. అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి! సాయం కోసం లక్షలమంది ఎదురుచూస్తున్నారు. శ్రీనగర్ మాత్రం ఇంకా జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నది. బహుళ అంతస్తుల భవనాల పైకిచేరిన ప్రజలు తమను ఆదుకోవాలంటూ ఆర్మీ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
photoload.aspజీలం నది ఉధృతంగానే ప్రవహిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మళయాలీ నటి అపూర్వ బోస్ సహా 300 మంది కేరళవాసులు కశ్మీర్ వరదల్లో చిక్కుకున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఐఏఎఫ్ సిబ్బంది చెమటోడ్చుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 50 వేల మందిని రక్షించారు. ఇంకా లక్షల మంది సాయం కోసం నిరీక్షిస్తున్నారు. భారీగా ఇండ్లు కూలిపోయాయి. వరదల కారణంగా 200 మందికిపైగా మృతిచెందినట్టు అధికారులు చెప్తున్నారు. దవాఖానాల్లో ఆహారం, మందులు అందక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా రాష్ట్రంలో బ్యాంక్‌సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక ఆరురోజుల తర్వాత శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని పునరుద్ధరించారు.

హెచ్చరించినా పట్టించుకోని రాష్ట్ర సర్కార్!

వరదల కారణంగా జమ్ముకశ్మీర్‌లో భారీ నష్టానికి కారణం జమ్ముకశ్మీర్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనా? అవుననే అంటున్నారు వాతావరణశాఖ అధికారులు. సెప్టెంబర్ రెండు నుంచి భారీ వర్షాలు ఉన్నాయని తాము ముందే హెచ్చరించినా రాష్ట్ర సర్కారు సహాయ చర్యలను చేపట్టలేదని వారు చెప్పారు. నది పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల కారణంగానే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో, గత ఏడాది ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం వాటిల్లిందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సహాయ బృందాల వీరోచిత శ్రమ

వరదల్లో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు సహాయబృందాలు వీరోచితంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ 215 దళాలను రంగంలోకి దింపి సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నది. 7200 బ్లాంకెట్లను, 210 టెంట్లను బాధితులకు అందించింది. చండీగఢ్, ఢిల్లీ నుంచి విమానాల ద్వారా భారీగా మంచినీటి బాటిళ్లను తరలిస్తున్నారు.

వైద్య సేవలకోసం 80 ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. వాతావరణం మెరుగవడంతో మొత్తం 61 విమానాలను సహాయచర్యల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దింపింది.కొండచరియలు విరిగిపడటంతో ఉధంపూర్ జిల్లాలో 30 మంది అదృశ్యమయ్యారు. వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నది.ఆపన్నహస్తం వరదల్లో చిక్కుకుపోయిన జమ్ము కశ్మీర్‌కు సహాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఐదు కోట్ల రూపాయల చొప్పున సాయం ప్రకటించగా, మంగళవారం మరికొన్ని రాష్ర్టాలు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 20 కోట్లను సాయంగా ప్రకటించింది. ఉత్తరాఖండ్, బీహార్ ప్రభుత్వాలు పదేసి కోట్లు, గుజరాత్, ఒడిశా ప్రభుత్వాలు ఐదుకోట్ల చొప్పున సాయాన్నిప్రకటించాయి. ఉత్తరాఖండ్ ప్రభు త్వం పదికోట్లతోపాటు నీటిని తోడే యంత్రాలనూ పంపింది. వరదల్లో చిక్కుకున్న మళయాల పర్యాటకులను ఆదుకునేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మహేంద్ర గ్రూప్ కూడా రెండు కోట్లు సాయంగా ప్రకటించింది.

No comments