దసరా ధూం ధాంకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం

హైదరాబాద్ : వంద రోజుల్లో చేసిందేమీలేదు. ఇప్పుడే మొదలుబెట్టినం. సమగ్ర సర్వేతో సమాచారమంతా తీసుకున్నం. ఇగ మైలపోలుతీస్తం. దసరా నుంచి సంక్షేమ పథకాలు అమలుచేస్తం.. ఇదీ తన వందరోజుల పాలన అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుక సాక్షిగా చెప్పినమాట! ఇప్పుడు ఆ మాటలు కార్యాచరణ రూపం సంతరించుకోబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చుతున్న టీఆర్‌ఎస్ సర్కార్.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న కీలక సంక్షేమ పథకాల అమలును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన తెలంగాణ.. ఇప్పుడు జమ్మిచెట్టుపై నుంచి అస్ర్తాలను దించుతున్నది. 
తమను ఇన్నాళ్లూ వేధించిన సమస్యలపై సమరానికి సిద్ధమవుతున్నది. ఒకనాటి తన వైభవాన్ని, ప్రాశస్థ్యాన్ని తిరిగి పొందేందుకు సమాయత్తమవుతున్నది. గత పాలకులు చేసిన తప్పిదాలను ఒక్కొక్కటీ సరిదిద్దుకుంటూ.. సరైన దృక్ఫథం, పకడ్బందీ ప్రణాళిక.. భావి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా దూరదృష్టితో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నది. సరైన ప్రణాళిక తయారు చేసుకుంటే సగం పని పూర్తయినట్లేనని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్.. సమరానికి వెళ్లే ముందు కీలకమైన ఆయుధాలకు పదునుపెట్టారు. ఇప్పుడు అవే ఆయుధాలను ఉపయోగించి.. తెలంగాణపాలిట సమస్యలను, అరవై ఏండ్ల చీకటిని పారదోలేందుకు రంగం సిద్ధం చేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment