Video Of Day

Breaking News

ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తుపై మా ధ్వారాలు తెరిచే ఉన్నాయి : శరద్ పవార్

ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు తమ ఆఫర్ ఇప్పటికీ సజీవంగానే ఉందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మరోసారి గుర్తుచేశారు. మరో రెండు రోజుల్లో.. అంటే బుధవారం నాడు అసెంబ్లీలో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తమకు సుస్థిర పాలన కావాలని, మరోసారి ఎన్నికలు రావడం ఇష్టం లేదని, అందుకే మద్దతు ఇస్తామని చెబుతున్నామని పవార్ అన్నారు. అయితే.. ప్రభుత్వం ఏదైనా తప్పుచేస్తే మాత్రం నిలదీయడానికి ఏమాత్రం వెనకాడేది లేదని స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలోనే ఉంటామంటూ శివసేన అధికారికంగా ఇప్పటికే ప్రకటించేసింది. దాంతో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తామున్నామంటూ శరద్ పవార్ మరోసారి ముందుకొచ్చారు. ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే.. ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. తాము బయటినుంచి బేషరతుగా సర్కారుకు మద్దతు ఇస్తామని పవార్ ముందునుంచి చెబుతున్నారు, ఇప్పుడూ అదే మాటమీద ఉన్నారు.  
శివసేనను కేవలం జూనియర్ భాగస్వామిగా అంగీకరించడానికి మాత్రమే బీజేపీ ముందుకొస్తోంది. కానీ శివసేన మాత్రం తాను పెద్దన్న పాత్ర పోషించాలనే భావిస్తోంది. అక్కడే పీటముడి పడింది. తమకు మహారాష్ట్రలో ఉపముఖ్యమంత్రి పదవి లేదా కనీసం హోం, ఆర్థికశాఖల్లాంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దానికి కమలనాథులు తలొగ్గకపోవడంతో ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకుంది.

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 మంది మద్దతు కావాలి. బీజేపీకి కేవలం 122 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. శివసేన 63,  కాంగ్రెస్‌ 42, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే బీజేపీకి 22 మంది మద్దతు అవసరం అవుతుంది.

No comments