Video Of Day

Breaking News

బాబు మీద ఆరోపణలు చేస్తే ప్రయోజనం లేదు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌,
దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నది ఎంత నిజమో తెలంగాణలో విద్యుత్‌ సమస్య ఉందన్నది కూడా అంతే నిజమని టి. టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో విద్యుత్‌ సమస్యలపై జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ గత 4 నెలలుగా తెలంగాణలో కరెంట్‌ కరెంట్‌ కోతలు తీవ్రంగా ఉన్నాయని టీడీపీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తు చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, వాస్తవాలను అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్లాలని, 
 ఢిల్లీ వెళ్లి న్యాయంగా తెలంగాణకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని విజ్ఞప్తి చేశామని... అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ చొరవ తీసుకుని సభలో అందరి సహకారం తీసుకుని, ఏకగ్రీవ తీర్మానం చేసి, రాష్ట్ర ప్రజల హక్కును, న్యాయంగా రావాల్సిన విద్యుత్‌ను రాబట్టుకుందామని ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రిని అభినందిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు.
 తెలంగాణలోని విద్యుత్‌ సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజల కష్టాలు తీరవని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ తెలంగాణ హక్కులను కాపాడ్డానికి పనిచేస్తోందని ఆయన అన్నారు. తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 5,061 మెగావాట్లకు పెంచారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రేవంత్‌రెడ్డి దొరవారిని (కేసీఆర్‌ను) సంతోషపెట్టడానికి నాపై దాడి చేయవద్దని అన్నారు.
విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన కేంద్రం పంచిందని రేవంత్‌రెడ్ది తెలిపారు. విద్యుత్‌ను వినియోగం ఆధారంగా పంచినా... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణకు 270 మిలియన్‌ యూనిట్లు అదనంగా వచ్చిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అసమర్ధతను చంద్రబాబుపై నెడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
 ఈ నేపథ్యంలో టి. మంత్రి హరీష్‌రావు జోక్యం చేసుకుని టి.టీడీపీ నేతలు తెలంగాణ అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ నేతలై ఉండి తెలంగాణ సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. పార్టీలకతీతంగా తెలంగాణ సమస్యలపై పోరాటం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. టి. టీడీపీ నేతలు తెలంగాణ పునర్నిర్మానికి కృషి చేయాలని, వారు బానిస సంకెళ్లు తెంచుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పని చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. ఈ నేపత్యంలో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు.

No comments