ఆ పార్టీలో ఉండటమే మీరు చేసుకున్న ఖర్మ : సీఎం కేసీఆర్

 తెలంగాణ శాసనసభ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా  సీఎం కేసీఆర్, టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎర్రబెల్లి మాట్లాడుతూ... రెండు నెలలుగా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. మెదక్ జిల్లాలోనే అన్నదాతలు బలవన్మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ హామీతో రైతులు పంటలు వేసుకున్నారని, తర్వాత సర్కారు మాట మార్చిందని అన్నారు. రైతు ఆత్మహత్య అంశంపై మాట్లాడుతుంటే సీఎం కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు.
దీంతో కేసీఆర్ కల్పించుకుని ఎదురుదాడి మాటను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ఎర్రబెల్లి స్పందిస్తూ.. మీరు రాసివ్వండి అదే మాట్లాడతా అని వ్యంగ్యంగా అన్నారు. విద్యుత్, విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు.
ఈ సమయంలో కేసీఆర్ జోక్యం చేసుకుని... టీడీపీ హయాంలో రైతు ఆత్మహత్యలు జరగనట్టు, ఇదేదో కొత్త ఆవిష్కరణ అయినట్టు ఎర్రబెల్లి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు ఈ దిక్కుమాలిన పరిస్థితి కల్పించిందే టీడీపీ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. విమర్శలు మాని రైతు ఆత్మహత్యల నివారణకు సూచనలు చేయాలని కోరారు. టీడీపీలో ఉండడమే మీ ఖర్మ అంటూ ఎర్రబెల్లిపై కేసీఆర్ మండిపడ్డారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment