బాపూజీకి నివాళులు అర్పించిన ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్ ఘాట్ కు చేరుకుని, అక్కడ మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. బాపూ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు. అనంతరం పియూష్ గోయల్ తదితరులకు అభివాదం చేసి అక్కడి నుంచి బయల్దేరారు. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ ఘాట్ వద్దకు వచ్చి, నివాళులు అర్పించడం గమనార్హం. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. గతంలో ఒకసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఒబామా బాపూజీకి నివాళులు అర్పించారు.
ముందుగా పలువురు భద్రతా దళాధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని అణువణువూ గాలించారు. ఇరుదేశాలకు చెందిన భద్రతా దళాల అధికారులతో పాటు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తదితరులు కూడా ఒబామా వెంట ఉన్నారు. బాపూజీ శాంతియుత పోరాటానికి ఒబామా ఏనాడో ఆకర్షితులయ్యారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తాను చేసిన ప్రసంగంలో కూడా ఆయన గాంధీజీ సిద్ధాంతాలను ప్రస్తావించారు.
అలా బాపూజీ అంటే ఎనలేని గౌరవం ఉన్న ఒబామా.. భారతదేశంలో తన రెండో కార్యక్రమంగానే రాజ్ ఘాట్ సందర్శనను ఎంచుకున్నారు. తొలుత రాష్ట్రపతి భవన్ లో స్వాగతం, సైనిక వందనం అనంతరం నేరుగా అక్కడి నుంచి రాజ్ ఘాట్ వెళ్లారు. ఈ సందర్భంగా రాజ్ ఘాట్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment