వైసీపీ ఒంటరి పోరాటం.. ఉపయోగం ఉంటుందా?

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాకా ఇంకా కనీసం సభలోకి కూడా అడుగుపెట్టలేదు కానీ.. విజయసాయి రెడ్డి ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచేందుకు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరే పదవులూ దక్కుండా నిరోధించేందుకు ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించనున్నట్టుగా సాయిరెడ్డి ప్రకటించాడు. ఇటీవలే ఈయన వైకాపా తరపు నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే సమావేశాల్లో ఈ ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టనున్నట్టుగా ఆయన ప్రకటించాడు.
మరి ఇప్పుడు ఫిరాయింపుల విషయంలో వైకాపా ఆందోళన ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. దేశంలో మరే పార్టీ కూడా బాధపడనంత స్థాయి బాధను అనుభవిస్తోంది జగన్ పార్టీ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి.. ఇంకా దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో అనేక ఫిరాయింపులు జరిగినా, జగన్ పార్టీ బాధే ఎక్కువగా ఉంది. ఎలాగంటే.. కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ, ఏదో కొన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపులు జరిగినంత మాత్రాన మరీ అంత నష్టం జరగదు. ఇక తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో ఫిరాయింపుల వల్ల నష్టపోయినా ఏపీలో అధికారంలో ఉంది, ఏపీలో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది కూడా!

అయితే జగన్ పార్టీ ఆశలన్నీ ఏపీ మీదే.. అక్కడ ఏకంగా ఇరవైమంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఫిరాయింపుదారులయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఫిరాయింపులకు ఎలాగైనా చెక్ చెప్పాలని ఈ పార్టీ శతథా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కోర్టుకు వెళ్లినా అందుకు ప్రయోజనాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రతిపాదిస్తామని ఈ పార్టీ ఎంపీ ప్రకటించాడు. మరి దీనికి ఎవరెవరు మద్దతుగా నిలుస్తారో.. ఈ బిల్లు ఫిరాయింపుదారులను ఏ మేరకు ఇబ్బంది పెట్టగలదో చూడాలి!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment